🙏 "నేను" కాదు "మనం "....కథ🙏
ఎయిర్ కమోడోర్ (వైమానికాధిపతి) విశాల్ ఒక జెట్ పైలట్. ఒక యుద్ధంలో, అతని యుద్ధ విమానాన్ని ఒక క్షిపణి ధ్వంసం చేయగా, ఆ విమానం నుండి బయటకి వచ్చి, పారాచూట్ సహాయంతో సురక్షితంగా భూమి మీదకు దిగాడు.
చాలా మంది అతని మీద ప్రశంసలు, పొగడ్తలు కురిపించారు.
ఈ సంఘటన జరిగిన ఐదు సంవత్సరాలకు, ఒక రోజు అతను తన భార్యతో కలిసి రెస్టారెంట్ లో కూర్చుని ఉన్నాడు. పక్కనే ఉన్న టేబుల్ వద్ద నుండి ఒక వ్యక్తి వచ్చి, "మీరు జెట్ ఫైటర్ కెప్టెన్ విశాల్, కదా? ఒకసారి మీ యుద్ధ విమానం క్షిపణి వల్ల ధ్వంసమైంది, అవునా?" అని అన్నాడు.
"మీకు ఎలా తెలుసు?" అడిగాడు విశాల్.
" ఆ రోజు మీ పారాచూట్ ను సిద్ధం చేసింది నేనే", అని నవ్వుతూ చెప్పాడు.
విశాల్ ఒక్కసారి భారంగా ఊపిరి పీల్చుకున్నాడు. ఆ క్షణంలో పారాచూట్ పని చేయకపోయుంటే, ఈ రోజు తాను ఇక్కడ ఉండేవాడు కాదని గ్రహించాడు. దీని గురించి ఆలోచించగానే, ఒళ్ళంతా ఒక్కసారిగా జలదరించి, అతని హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది.
ఆ రాత్రి విశాల్ కి నిద్ర పట్టలేదు. ఆ వ్యక్తిని తాను ఎన్నిసార్లు చూసిఉంటాడా అని ఆశ్చర్యపోయాడు.
అతనిని ఎప్పుడూ పట్టించుకోలేదు, - "గుడ్ మార్నింగ్, ఎలా ఉన్నారు?" అని ఏనాడూ పలకరించలేదు.
నిజానికి, అతనితో ఎప్పుడూ అసలు మాట్లాడలేదు కూడా, ఎందుకంటే తానేమో ఒక యుద్ధ విమాన పైలట్, ఆ వ్యక్తి కేవలం ఒక సాధారణ భద్రతా ఉద్యోగి మాత్రమే.
కాబట్టి మిత్రులారా, మన పారాచూట్ ను ఎవరు సిద్ధం చేస్తున్నారు?
ప్రతీ ఒక్కరికి, వారి జీవితంలో, ఆ రోజులో చేయవలసిన వాటిని అందించడానికి ఎవరో ఒకరు తప్పకుండా ఉంటారు. జీవితాన్ని సురక్షితంగా గడపడానికి మనకు పారాచూట్ లు అవసరం - భౌతికమైన పారాచూట్, మానసికమైన, భావోద్వేగపరమైన, ఆధ్యాత్మికమైన - ఇలా అన్ని రకాల పారాచూట్ ల అవసరం ఉంటుంది.
కొన్నిసార్లు జీవితంలో మనం ఎదుర్కునే రోజువారీ సవాళ్లలో, ఈ ముఖ్యమైన అంశాన్ని మనం మర్చిపోతాం.
మనం అలాంటివారికి, 'హలో, ప్లీజ్ , ధన్యవాదాలు', ఇలాంటివి చెప్పుండకపోవచ్చు, కానీ ఏదైనా ఒక మంచి విషయంలో వారిని అభినందించవచ్చు, మెచ్చుకోవచ్చు లేదా ఏ కారణం లేకుండా కూడా మనమే వారికి ఏదైనా మంచి చేయవచ్చు.
ఒకసారి కళ్ళు మూసుకుని - మన ఇంటి నుండి చెత్త తీసుకెళ్లే వ్యక్తి, మన ఇంటి బయట ప్రతిరోజూ చీపురుతో తుడిచే స్త్రీ, మన సొసైటీకి / కాలనీకి చెందిన సెక్యూరిటీ గార్డు, ప్రతిరోజూ పాఠశాలకు మన పిల్లలను దించి, తీసుకొచ్చే బస్ కండక్టర్ లేదా డ్రైవరు - వీళ్ళ పేర్లను గుర్తుచేసుకునే ప్రయత్నం చేద్దాం.
ఏదో ఒక విధంగా, మన పారాచూట్ ను ఏ రకంగానైనా సిద్ధం చేసిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు తెలియజేయండి!
కృతజ్ఞత అనేది చాలా శక్తివంతమైన వైఖరి, గొప్ప సానుకూల భావోద్వేగం. కృతజ్ఞత అనేది హృదయపూర్వక సాధన యొక్క ఫలితం. ....🙏
No comments:
Post a Comment