Saturday, October 19, 2024

ఆఖరి మజిలీ ....... (THE DETACHMENT)

 ఆఖరి మజిలీ

------------------------------------------

   (THE DETACHMENT)


ఆమె వయస్సు 65 ఏళ్లు… 

మదనపల్లె నుంచి బెంగుళూర్ కు వెళ్లిపోతోంది… 

అక్కడ లో ఓ సీనియర్ సిటిజెన్స్ హోమ్‌కు… 

అనగా ఓ ప్రత్యేక వృద్ధాశ్రమానికి… 

ఆమె భర్త కొన్నేళ్ల క్రితం చనిపోయాడు… 

ఆమె చదువుకున్నదే… 

ముగ్గురు పిల్లల పెళ్లిళ్లు చేసింది.

 వాళ్లందరూ అమెరికా పౌరులు.

 అందరికీ ఇద్దరేసి పిల్లలు…

 వాళ్లంతా హైస్కూల్, కాలేజీ చదువుల్లో ఉన్నారు… 

ఈమె అమెరికాకు బోలెడుసార్లు వెళ్లింది… 

కాన్పులు చేసింది…


వెళ్లిన ప్రతిసారీ ఆరు నెలలపాటు ఉండేది… 

ఇక చాలు అనుకుంది… 

ఇక తన అవసరం ఎవరికీ ఏమీ లేదు. 

అమెరికాకు వెళ్లాలని లేదు, రానని చెప్పేసింది… 

ఆరోగ్యంగా మిగిలిన జీవితం గడపాలి చాలు… 

అందుకే ఆమె సీనియర్ సిటిజెన్స్ హోం కు వెళ్లిపోతోంది… 

వాటినే రిటైర్‌మెంట్ హోమ్స్ అనండి… 

అమెరికాలో వాటినే నర్సింగ్ హోమ్స్ అంటారుట… 

ఆమె ఏమంటున్నదో చదువండి.


‘‘వెళ్తున్నాను…

ఇక తిరిగి ఎక్కడికీ రాను…

నా విశ్రాంత, చివరి కాలం గడపటానికి ఓ స్థలం వెతుక్కున్నాను…

 వెళ్లకతప్పదు…

తమ పిల్లల బాగోగుల గురించి నా పిల్లలు బిజీ…

ఎప్పుడో గానీ నేను వారి మాటల్లోకి రాను… 

నేనిప్పుడు ఎవరికీ ఏమీ కాను…

ఎవరికీ అక్కరలేదు…

ఆశ్రమం అంటే ఆశ్రమం ఏమీ కాదు…

అది రిటైర్‌మెంట్ హోం…

 బాగానే ఉంది…

ఒక్కొక్కరికీ ఒక సింగిల్ రూం…

 మరీ అవసరమైన ఎలక్ట్రికల్ పరికరాలు… 

టీవీ… అటాచ్డ్ బాత్రూం… బెడ్డు…

ఏసీ కూడా ఉంది…

కిటికీ తెరిస్తే బయటి గాలి…

 ఫుడ్డు కూడా బాగుంది…

 సర్వీస్ బాగుంది…

కానీ ఇవేమీ చవుక కాదు…

 ప్రియమైనవే… 

నాకొచ్చే పెన్షన్ బొటాబొటీగా ఈ అవసరాలకు సరిపోతుంది…

సరిపోదంటే నాకున్న సొంత ఇంటిని అమ్మేయాల్సిందే…

అమ్మేస్తే ఇక చివరి రోజులకు సరిపడా డబ్బుకు ఢోకాలేదు…

 నా తరువాత ఏమైనా మిగిలితే నా కొడుక్కి వెళ్లిపోతుంది… 

సో, ఆ చీకూచింత ఏమీ లేదు…

 ‘నీ ఇష్టం అమ్మా, నీ ఆస్తిని నీ అవసరాలకే వాడుకో…’’ అన్నాడు నా వారసుడు…


వెళ్లిపోవడానికి సిద్ధమైపోతున్నాను…

ఓ ఇంటిని వదిలేయడం అంటే అంత సులభమా..? 

కాదుగా…

బాక్సులు, బ్యాగులు, అల్మారాలు, ఫర్నీచర్, రోజువారీ మన జీవితంతో పెనవేసుకున్న బోలెడు పాత్రలు…

అన్ని కాలాల్లోనూ మనల్ని కాపాడిన బట్టలు…

సేకరణ అంటే నాకిష్టం…

 లెక్కలేనన్ని స్టాంపులు ఉన్నయ్…

 చాయ్ కప్పులున్నయ్…

 అత్యంత విలువైన పెండెంట్లు, బోలెడు పుస్తకాలు…అల్మారాల నిండా అవే…

డజన్లకొద్దీ విదేశీ మద్యం సీసాలున్నయ్…

బోలెడంత వంట సామగ్రి ఉంది…

అరుదైన మసాలాలు…

ఇవే కాదు, అనేక ఫోటో అల్బమ్స్… ఇవన్నీ ఏం చేయాలి..?

నేను ఉండబోయే ఆ ఇరుకైన గదిలో వాటికి చోటు లేదు… 

నా జ్ఞాపకాల్ని అది మోయలేదు… 

అది భద్రపరచదు కూడా…

 ఏముంది ఆ గదిలో…?

మహా అయితే ఓ చిన్న కేబినెట్, ఓ టేబుల్, ఓ బెడ్, ఓ సోఫా ఓ చిన్న ఫ్రిజ్, ఓ చిన్న వాషింగ్ మెషిన్, ఓ టీవీ, ఓ ఇండక్షన్ కుక్కర్, ఓ మైక్రోవేవ్ ఓవెన్… 

అన్నీ అవసరాలే…

కానీ నా జ్ఞాపకాల్ని కొనసాగించే సౌకర్యాలు కావు…


నేను నా విలువైన సంపద అనుకున్న ఏ సేకరణనూ నాతో ఉంచుకోలేను…

అకస్మాత్తుగా అవన్నీ నిరుపయోగం అనీ, అవి నావి కావనీ అనిపిస్తోంది…

అన్నీ నేను వాడుకున్నాను, అంతే…

అవి ప్రపంచానికి సంబంధించినవి మాత్రమే…

 నావి ఎలా అవుతాయి..?

నా తరువాత ఎవరివో…

 రాజులు తమ కోటల్ని, తమ నగరాల్ని, తమ రాజ్యాల్ని తమవే అనుకుంటారు…

కానీ వాళ్ల తరువాత అవి ఎవరివో…

నిజానికి ప్రపంచ సంపద కదా…


మనతోపాటు వచ్చేదేముంది..?

వెళ్లిపోయేది ఒక్క దేహమే కదా… 

అందుకని నా ఇంట్లోని ప్రతిదీ దానం చేయాలని నిర్ణయించాను…

కానీ అవన్నీ కొన్నవాళ్లు ఏం చేస్తారు..? 

నేను అపురూపంగా సేకరించుకున్న ప్రతి జ్ఞాపకం వేరేవాళ్లకు దేనికి..?

వాటితో వాళ్లకు అనుబంధం ఉండదుగా…

బుక్స్ అమ్మేస్తారు…

నా గురుతులైన ఫోటోలను స్క్రాప్ చేసేస్తారు…

ఫర్నీచర్ ఏదో ఓ ధరకు వదిలించుకుంటారు…

బట్టలు, పరుపులు బయటికి విసిరేస్తారు…

వాళ్లకేం పని..?


మరి నేనేం ఉంచుకోవాలి..?

నా బట్టల గుట్ట నుంచి కొన్ని తీసుకున్నాను… 

అత్యవసర వంట సామగ్రి కొంత…

తరచూ పలకరించే నాలుగైదు పుస్తకాలు…

ఐడీ కార్డు, సీనియర్ సిటెజెన్ సర్టిఫికెట్, హెల్త్ ఇన్స్యూరెన్స్ కార్డ్, ఏటీఎం కార్డు, బ్యాంకు పాస్ బుక్కు…

చాలు…

 అన్నీ వదిలేశాను…

బంధం తెంచేసుకున్నాను… 

నా పొరుగువారికి వీడ్కోలు చెప్పాను…

డోర్ వేసి, గడపకు మూడుసార్లు వంగి మొక్కుకున్నాను…

ఈ ప్రపంచానికి అన్నీ వదిలేశాను…


ఎవరో చెప్పినట్టు… ఏముంది.? 

ఓ దశ దాటాక… కావల్సింది ఒక మంచం… ఓ గది ...అత్యవసరాలు…

మిగిలినవన్నీ గురుతులు మాత్రమే…

ఇప్పుడు అర్థమవుతుంది మనకు…

మనకు పెద్దగా ఏమీ అక్కర్లేదు… 

మనం ఇకపై సంతోషంగా ఉండేందుకు మనకు ఇక ఎటూ పనికిరానివాటిని సంకెళ్లుగా మిగుల్చుకోవద్దు…

వదిలేయాలి…

 వదిలించుకోవడమే…


కీర్తి, సంపద, భవిష్యత్తు… అన్నీ ఓ ట్రాష్…

లైఫ్ అంటే చివరికి ఓ పడకమంచం మాత్రమే…

 నిజంగా అంతే…

అరవై ఏళ్లు పైబడ్డామంటే ఆలోచన మారాలి…

 ప్రపంచంతో అనుబంధం ఏమిటో తెలుసుకోవాలి…

 అంతిమ గమ్యం ఏమిటో, భవబంధాలేమిటో అర్థమవ్వాలి…

మన ఫాంటసీలు, మన బ్యాగేజీతో పాటు మనం ఇక తినలేని, అనుభవించలేని, ఉపయోగించలేనివి వదిలేయక తప్పదు…

అందుకే బంధం పెంచుకోవడమే వృథా…

సో

ఆరోగ్యంగా ఉండండి…

 ఆనందంగా ఉండండి…

 ఏదీ మనది కాదు…

ఎవరూ మనవాళ్లు కారు…

 మనిషి ఒంటరి…

 మహా ఒంటరి…

వచ్చేటప్పుడు, పోయేటప్పుడు’’..!!


నీతి : 

ఎవరికి ఏం అర్ధమయితే అది...🙏


జీవిత సత్యం. ఎవరు నీవారు కారు ఎవరు నీతోడు రారు . చివరి మజిలీ 

No comments:

Post a Comment